బీరసాగర్ ఇసుక క్వారీ సమీపంలో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బీరసాగర్ ఇసుక క్వారీ సమీపంలో ఇసుక లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. క్వారీలో ఇసుక లోడ్ చేసుకున్న లారీ రోడ్డుపైకి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. ఇసుక క్వారీ కాంట్రాక్టర్ నిబంధనలు పాటించకుండా, లారీలను ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే పార్కింగ్ చేసి ఉంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రహదారిపైనే లారీల నిలుపుదలతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి రహదారిపై లారీల పార్కింగ్‌ను అరికట్టి, భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.