బీఆర్ఎస్ పోరాటంతో బాధిత కుటుంబానికి పరిహారంపై హామీ
మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బీరసాగర్ ఇసుక రీచ్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోత స్వామి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన ఎట్టకేలకు విరమించారు. మహాదేవపూర్ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాబు, మంథని మహిళా విభాగం అధ్యక్షురాలు కేదారి గీత, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం తెలపగా, బీజేపీ నాయకులు సైతం మద్దతు ప్రకటించారు. అధికారుల జోక్యంతో ఇసుక క్వారీ కాంట్రాక్టర్, లారీ యజమాని, టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు సమాచారం.