🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Nov, 2026 | Page: 1

అంగన్‌వాడీ చిన్నారులకు ఆట వస్తువులు, వాటర్‌ బాటిళ్ల పంపిణీ

నర్సంపేట: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా నిర్వహిస్తూ సామాజిక సేవకు ప్రాధాన్యమిచ్చారు నల్ల వంశీకృష్ణారెడ్డి–హర్షిత దంపతులు. తమ కుమారుడు విదిక్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట-4 అంగన్‌వాడీ కేంద్రంలోని పూర్వ ప్రాథమిక విద్యార్థినీ, విద్యార్థులకు ఆట వస్తువులు, వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు.
లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నర్సంపేట గ్లోరీ అధ్యక్షుడు మోతె ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి నల్ల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.5 వేల విలువైన కో-కరిక్యులర్‌ ఆట వస్తువులతో పాటు చిన్నారులకు అవసరమైన వాటర్‌ బాటిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా మోతె ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రోజుల్లో అనవసర ఖర్చులు చేయకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నర్సంపేట గ్లోరీ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల కోసం మంచి కార్యక్రమాన్ని చేపట్టి సామగ్రిని అందించిన వంశీకృష్ణారెడ్డి–హర్షిత దంపతులను అభినందించారు. భవిష్యత్‌లోనూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
అంగన్‌వాడీ టీచర్‌ నల్ల భారతి మాట్లాడుతూ ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయని తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయడం వల్ల పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో పిల్లల సంరక్షణ బాధ్యత భారంగా మారుతోందని, అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులకు అమ్మఒడిలా అండగా నిలుస్తున్నాయని అన్నారు. తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.శోభ, ఉపాధ్యాయులు య.పద్మ, అంగన్‌వాడీ టీచర్‌ నల్ల భారతి, ఆయా సునీత, దేవరకొండ సాహితి, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, అంగన్‌వాడీ చిన్నారులు పాల్గొన్నారు.
🏠 Home