🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 29 Oct, 2026 | Page: 1

ఎంపీ కార్యక్రమానికి హాజరైతే సస్పెండ్ చేస్తారా?


మల్హర్: కాంగ్రెస్ పార్టీ కోసం గత 20 ఏళ్లుగా జెండా మోసి, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తే, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మల్హర్ మండలం కొయ్యూరు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కార్యక్రమానికి హాజరైనందుకే తమపై సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని పేర్కొన్నారు.కొయ్యూరు గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్‌తో పాటు వార్డు సభ్యులు లకావత్ లక్ష్మీ, తిరుపతి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖలీంను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల కొయ్యూరు గ్రామంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠశాల సంచులను పంపిణీ చేసిన కార్యక్రమానికి హాజరైనందుకే తమపై చర్యలు తీసుకున్నారని వారు ఆరోపించారు.
ఒక ఎంపీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కావడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనా అని ప్రశ్నించారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు. అసలు తమను ఎందుకు సస్పెండ్ చేశారో స్పష్టత ఇవ్వాలని, సస్పెండ్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. సొంత పార్టీకి చెందిన ఎంపీని కలవడం తప్పా అని ప్రశ్నిస్తూ, తమపై తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కలిసి వివరించనున్నట్లు తెలిపారు.
🏠 Home