🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 04 Sep, 2026 | Page: 1

కరెంట్ షాక్‌తో తొమ్మిదో తరగతి విద్యార్థిని దుర్మరణం: నల్లబెల్లిలో విషాదం

నల్లబెల్లి: విద్యుత్ ఘాతానికి గురై ఓ పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేష్ కుమార్తె పిట్టల సిరివెన్నెల (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసేందుకు సిద్ధమైన ఆమె, నీటి మోటార్‌ను ఆన్ చేయడానికి స్విచ్ బోర్డు వద్దకు వెళ్లింది. అంతకుముందే ఆ వైర్లను ఎలుకలు కొరికి వేయడంతో, స్విచ్ వేయగానే సిరివెన్నెల తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలింది.
​అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమార్తెను గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈఎంటీ సిబ్బంది బాలికకు సీపీఆర్ నిర్వహించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. కళ్లముందే విగతజీవిగా మారిన కుమార్తెను చూసి ‘ఈరోజు స్కూల్ ఉండి ఉంటే నా బిడ్డ బతికేది’ అంటూ తండ్రి గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
🏠 Home